క్రైమ్

టెకీలకు ఏమైంది? 30వ ఫ్లోర్ పైనుంచి పడి మరొక యువ టెకీ మృతి

నగరంలో హర్యానాకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నిన్న హీలియం గ్యాస్ పీల్చి ఆత్మహత్యకు పాల్పడగా.. తాజాగా మరో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రాణాలు కోల్పోయాడు. 30వ ఫ్లోర్ పై నుంచి పడి చనిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ గచ్చిబౌలి పీఎస్‌ పరిధిలోని నానక్‌రామ్‌గూడలో ఉన్న గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్‌మెంట్స్‌లో మంగళవారం ఉదయం వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న భరత్(29) అనే యువకుడు 30వ ఫ్లోర్ నుంచి పడి అనుమానాస్పద కింద పడిపోయాడు. నేరుగా కారు మీద పడటంతో సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించారు. కాగా, అప్పటికే తీవ్ర గాయాలతో భరత్ మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. బెంగళూరులోని ఓ కంపెనీలో పని చేస్తున్న భరత్.. రెండు రోజుల క్రితమే గోల్ఫ్ ఎడ్జ్‌ అపార్ట్‌మెంట్స్‌లో మారినట్టు తెలిసింది. కిశోర్ అనే బంధువు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భరత్ మరణానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.