కేసీఆర్ చావు కోరిన ఎమ్మెల్యేపై చర్యలేవి : మాజీమంత్రి తలసాని
అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజాసమస్యలపై ప్రతిపక్షాలు ప్రశ్నించకుండా కావాలనే టాపిక్ డైవర్ట్ చేసి తమను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. 22 ఏ, ఫీజు రీయింబర్స్ మెంట్, జీవో 97 (పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థుల అంశం).. రైతు సమస్యలు, సాగు నీరు, కృష్ణా గోదావరి అంశాలపై ఎటువంటి చర్చ జరగకూడదనే రేవంత్ సర్కార్ రాష్ట్రంలో గందరగోళం సృష్టించిందని ఆరోపించారు. కావాలనే పోలీసులతో తమను సభలోకి రాకుండా చేయడం, కాంగ్రెస్ నేతలను ఎర్రవల్లికి పంపించి ప్రజల అటెన్షన్ మొత్తం డైవర్ట్ చేయించారని అన్నారు. దీనికి తోడు AI సాయంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫొటోలు మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారని ఆరోపించారు.రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ చావును కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారని, కేసీఆర్ చావు కోరుకున్న ఎమ్మెల్యేలను సభలో పెట్టుకున్నారని చెప్పారు. కేసీఆర్ చావు కోరుకున్న ఎమ్మెల్యేను సస్పెండ్ చేయలేదు కానీ, సభలో లేని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ను సస్పెండ్ చేయడం ఏంటని ప్రశ్నించారు.
