తెలంగాణ

గాంధీ, నెహ్రూ, యాదవ్ నాయకత్వం మాకు అవసరం లేదు : అసదుద్దీన్ ఒవైసీ

దేశ రాజకీయాల్లో ముస్లిం ప్రాధాన్యంపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన రెండు నెలల ముందుగానే అక్కడ ఎన్నికల ప్రచారం ప్రారంభించినట్టు తెలుస్తోంది. దేశ రాజకీయాల్లో ముస్లింలు ఎవరికీ బానిసలు కాదని, సంప్రదాయ పార్టీల వెనుక నడవాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. యూపీలోని రాంపూర్‌‌లో ఆయన మాట్లాడుతూ.. తమకు నెహ్రూ, గాంధీ , యాదవ్ కుటుంబాల నాయకత్వం ఇకపై అవసరం లేదన్నారు. ముస్లిం సమాజం నుంచి స్వయంగా నాయకులు ఎదుగుతారని పేర్కొన్నారు. ఇంకెన్నాళ్లు ఇతర పార్టీల నాయకుల వెనుక తిరుగుతారని ప్రశ్నించారు. సంప్రదాయ లీడర్లను నెహ్రూ, గాంధీలుగా భావించి మద్దతు ఇవ్వాలని కొందరు మనవారే చెబుతున్నారని, ‘అలాంటి వారికి, ఒవైసీకి ఉన్న తేడా ఇదే. వాళ్లు ఇతరులను సమర్థించమంటారు. కానీ నేను మాత్రం మీరే నాయకులు కండి అంటాను’ అని అసదుద్దీన్ ఒవైసీ తేల్చిచెప్పారు.