తెలంగాణ

నల్గొండ-పాలమూరు మధ్య ముదిరిన జల వివాదం.. సీఎం నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ

Water War: నల్గొండ-పాలమూరు మధ్య జల వివాదం ముదిరింది. పాలమూరు ఏదుల రిజర్వాయర్ నుంచి డిండి ప్రాజెక్టుకు నీటి తరలింపు వ్యవహారం చిచ్చు రాజేసింది. ఈ అంశంపై ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్ ప్రతినిధులు ఆగ్రహంగా ఉన్నారు. ప్రభుత్వం ఈ చర్యలు మానుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఉమ్మడి పాలమూరు జిల్లా నేతలు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఉత్తమ్ ను కలిశారు. ఇదే సమావేశానికి మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, నల్గొండ జిల్లా సీనియర్ నేత జానారెడ్డి కూడా హాజరుకావడం ఆసక్తికరంగా మారింది. దాదాపు గంటన్నరపాటు మంత్రి ఉత్తమ్ తో చర్చించారు. పాలమూరు నుంచి డిండి ప్రాజెక్టుకు నీటి తరలింపును ఆపాలని ప్రజాప్రతినిధులు మంత్రి ఉత్తమ్ కి విజ్ఞప్తి చేశారు.