TG : నీటి కటకట.. శ్రీశైలం ప్రాజెక్టులో భారీగా తగ్గిన నీటి నిల్వలు
రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం కారణంగా ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు క్రమంగా పడిపోతున్నాయి. ఇప్పటికే చాలా ప్రాజెక్టులు డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్ముందు సాగుతో పాటు తాగు నీటి సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటికే సీరియస్గా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. వేసవిలో తాగు నీటి కష్టాలు రాకుండా ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నట్టు సమాచారం. ఇదిలాఉండగా, శ్రీ శైలం ప్రాజెక్టులో నీటి నిల్వలు భారీగా తగ్గినట్టు తెలుస్తోంది. 215.80 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి గానూ ప్రస్తుతం 48.57 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నట్టు సమాచారం. 885 అడుగుల పూర్తి స్థాయి నీటిమట్టానికి ప్రస్తుతం 829.10 అడుగులు ఉన్నట్టు తెలిసింది.కేవలం 9 రోజుల్లో 3.03 టీఎంసీల మేర నీటి నిల్వలు తగ్గినట్టు అధికారులు అంచనా వేశారు. రోజుకు సగటున 0.33 టీఎంసీల నీటి తగ్గుదల నమోదు అయినట్టు తేల్చారు.
