తెలంగాణ

Warangal MGM: వరంగల్ ఎంజీఎంలో షాకింగ్ ఘటన.. పెచ్చులూడి పడి పలువురికి గాయాలు!

Warangal MGM: వరంగల్ ఎంజీఎం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రమాదం చోటుచేసుకుంది. రోగాల నుంచి విముక్తి పొందేందుకు ఆస్పత్రికి వచ్చిన పేషెంట్లపై పెచ్చులూడి పడ్డాయి. ఆరోగ్యశ్రీ వార్డులో ఎప్పటిలాగే ఆదివారం చికిత్స పొందుతున్న రోగులు, వారికి సపర్యలు చేస్తున్న కుటుంబ సభ్యులతో సందడిగా ఉంది. సరిగ్గా అదే సమయంలో ఎవరూ ఊహించని రీతిలో వార్డు పైకప్పు పెచ్చులు పెద్ద శబ్దంతో ఒక్కసారిగా ఊడి కిందపడ్డాయి. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఆ శిథిలాలు నేరుగా రోగులపై పడ్డాయి. ఈ ఊహించని పరిణామంతో వార్డులో చికిత్స పొందుతున్న సారయ్య, మస్తాన్, స్వరూపలతో పాటు వారిని పరామర్శించేందుకు వచ్చిన బంధువులు తీవ్రంగా గాయపడ్డారు. అంతేకాకుండా అక్కడే విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు కూడా ఈ ప్రమాదం బారినపడ్డారు.పైకప్పు విరిగిపడటంతో ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురైన తోటి పేషెంట్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. అప్రమత్తమైన ఇతర సిబ్బంది వెంటనే క్షతగాత్రులను ఎమర్జెన్సీ వార్డు తరలించి తక్షణ చికిత్స అందించారు.