తెలంగాణ

TG: ప్రాజెక్టుల పర్మిషన్ల విషయంలో ప్రధాని చొరవ కోరాం: ఉత్తమ్

TG: తెలంగాణలో నిలిచిపోయిన సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ పర్మిషన్లు ఇప్పించే విషయంలో చొరవ తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరినట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి, రాష్ట్ర ఉన్నతాధికారుల బృందం ఢిల్లీలో ప్రధాని మోడీతో ప్రత్యేకంగా భేటీ అయ్యింది. ఈ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ కీలక వివరాలను వెల్లడించారు.రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన సమస్యలపై ప్రధానితో సుదీర్ఘంగా చర్చించినట్లు చెప్పారు. ముఖ్యంగా పర్యావరణ పర్మిషన్లు రాకపోవడం వల్ల ఎంతో ముఖ్యమైన ప్రాజెక్టుల పనులు మధ్యలోనే ఆగిపోయాయని ప్రధాని దృష్టికి తీసుకెళ్లామన్నారు. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతులు ఇవ్వడంలో చాలా లేట్ చేస్తోందని, దీనివల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని ఆయనకు వివరించినట్లు తెలిపారు.