National

US Politics: వైట్‌హౌస్‌పై అసంతృప్తి తుఫాను.. మిడ్‌టర్మ్స్‌లో ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ తప్పదా?

US Politics: అమెరికా రాజకీయాల్లో మధ్యంతర ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని రిపబ్లికన్ పార్టీకి ఈ ఎన్నికల్లో భారీ ఎదురుదెబ్బ తప్పదని తాజా సర్వేలు హెచ్చరిస్తున్నాయి. రెండోసారి పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఆయన తీసుకుంటున్న దూకుడు నిర్ణయాలు, వివాదాస్పద విధానాల వల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, ఆయన ప్రజాదరణ ఏకంగా 38 శాతానికి పడిపోయిందని తేలడం సంచలనం రేపుతోంది.ఈ మిడ్‌టర్మ్స్‌ ఎన్నికలు ట్రంప్ పాలనకు ప్రజా రెఫరెండంగా మారగా, యూఎస్ ప్రతినిధుల సభపై రిపబ్లికన్లు పట్టు కోల్పోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ప్రముఖ విశ్లేషక సంస్థ ‘రియల్ క్లియర్ పాలిటిక్స్’ అంచనా ప్రకారం డెమోక్రాట్లు 227 సీట్లు గెలుచుకుని సభపై పట్టు సాధించనున్నారు. అటు ‘సీబీఎస్ న్యూస్’ సర్వే డెమోక్రాట్లకు 229 సీట్లు దక్కుతాయని స్పష్టం చేయగా, ‘కుక్ పొలిటికల్ రిపోర్ట్’ సైతం వారికి కనీసం 220 స్థానాలు ఖాయమని తేల్చింది. అయితే ఎగువ సభ అయిన సెనెట్‌లో మాత్రం ఇరు పార్టీల మధ్య హోరాహోరీ పోరు తప్పేలా లేదు.