National

UPI: పండుగల వేళ ‘యూపీఐ’ ట్విస్ట్.. తెరవెనుక ఏం జరిగింది?

UPI: పండుగల సీజన్ మొదలైంది అంటే చాలు.. మార్కెట్లు కొనుగోలుదారులతో కిటకిటలాడుతాయి. పల్లెటూరి కిరాణా కొట్టు నుంచి నగరాల్లోని భారీ షాపింగ్ మాల్స్ దాకా కరెన్సీ నోట్ల సవ్వడి కంటే ‘క్యూఆర్ కోడ్’ స్కానింగ్‌ల చప్పుడే ఎక్కువగా వినిపిస్తుంది. దేశంలో డిజిటల్ విప్లవానికి ప్రతీకగా మారిన యూపీఐ నెట్‌వర్క్‌పై సరిగ్గా ఇలాంటి పండుగ వేళ ఒక భారీ పిడుగు పడబోయింది. రూ.2,000 దాటిన లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) పేరుతో కొత్త ఛార్జీల బాదుడు మొదలుకావాల్సింది. కానీ చివరి నిమిషంలో సీన్ మారింది. వ్యాపార వర్గాల ఆందోళనలతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా హోల్డ్‌లో పెట్టింది.దేశవ్యాప్తంగా సాగే డిజిటల్ చెల్లింపుల వ్యవహారాలను ఎన్‌పీసీఐ పర్యవేక్షిస్తుంది. ఈ క్రమంలోనే ఎంపిక చేసిన కస్టమర్-టు-మర్చంట్ (P2M) యూపీఐ చెల్లింపులపై 0.4 శాతం ఎండీఆర్ రుసుము వసూలు చేయాలని నిర్ణయించారు. దీనిని అక్టోబర్ 15 నుంచే పక్కాగా అమల్లోకి తేవాలని భావించారు.