తెలంగాణ

ఆలంపూర్‌లో కేంద్రమంత్రి ప్రత్యేక పూజలు

కేంద్ర బొగ్గు,గనుల శాఖల మంత్రి కిషన్ రెడ్డి సోమవారం ఆలంపూర్‌లోని ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.ఆదివారం రాత్రి హరిత హోటల్లో బస చేసిన కేంద్రమంత్రి ఉదయం మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణతో కలిసి మొదట బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు, పూజారులు పూర్ణకుంభంతో, మేళతాళాలతో ముఖ్య అతిథులకు ఘనంగా స్వాగతం పలికారు. మొదట వినాయకుని పూజల్లో పాల్గొన్న అతిథులు..ఆ తర్వాత స్వామి వారికి అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం సమీపంలోని జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పరిసరాల్లో కేంద్ర మంత్రి ఇతర అతిథులతో కలిసి మొక్కను నాటారు. ఆలయ అధికారులు, పూజారులు అతిథులకు స్వామి,అమ్మవారి చిత్రపటాలను, ప్రసాదాలను అందజేసి వేద ఆశీర్వచనం అందజేశారు. ఆ తర్వాత ఆలయ అధికారులు క్షేత్ర విశిష్టతను అతిథులకు వివరించారు.