TG : తెలంగాణలో మరో ఇద్దరు రైతుల ఆత్మహత్య
రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓ వైపు ఎల్ నినో ప్రభావం మరోవైపు సాగు నీరు లేక కోత దశకు వచ్చిన పంటలు ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పంటలు ఎండిపోవడంతో పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులకు వడ్డీల భారం మరింత పెరుగుతుండటంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ క్రమంలోనే అప్పులు తిరిగి చెల్లించలేక రైతులు చావే మార్గంగా ఎంచుకుంటున్నారు.తాజాగా అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో అప్పులు తీర్చే మార్గం లేక రైలు కింద పడి కౌలురైతు ఆశన్న (43) ఆత్మహత్యకు పాల్పడ్డారు. 17 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి, కంది సాగు చేసిన ఆశన్న .. ఆశించిన దిగుబడి రాక, ఇదివరకు చేసిన అప్పుల భారం పెరిగిపోవడంతో అవి తీర్చలేక ప్రాణాలు తీసుకున్నాడు.
