రెండు ఎమ్మెల్సీలు ‘రెడ్ల’కే..ఇది సామాజిక అన్యాయం కాదా? : కవిత
సామాజిక న్యాయం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం అవుతుందని పదే పదే లీడర్లు చెబుతుంటారు. కానీ, తీరా సమయం వచ్చే సరికి ఆ విషయం వారికి గుర్తుకురాదేమో అన్నట్టు బిహేవ్ చేస్తుంటారు. రాష్ట్రంలో బీసీ కులాలు ఎక్కువ. ఎన్నికలు వచ్చినా, పదవుల పంపకంలో మాత్రం వారికి అన్యాయం జరుగుతోందని ఆ వర్గం ప్రజలు తమ వాయిస్ వినిపిస్తున్నారు. రాష్ట్ర కేబినెట్లోనూ బీసీలకు న్యాయం జరగలేదని ఇటీవల టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సైతం ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. తాజాగా తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ విషయంపై స్పందించారు. రెడ్లకే రెండు సీట్లు కేటాయించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు.. రెండు చోట్లా ‘రెడ్డి’ నాయకులకే టికెట్.. ఇది ముమ్మాటికీ సామాజిక అన్యాయం కాదా?’ అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో సబ్బండ వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిన బాధ్యత అధికార పార్టీపై ఉందని గుర్తుచేశారు. అలా కాకుండా ఒకే వర్గానికి పెద్దపీట వేయడం తెలంగాణ ఆత్మగౌరవానికే విరుద్ధమని ఘాటు విమర్శలు చేశారు.
