22ఏ పరేషాన్.. ఎమ్మెల్యేల మాట వినని కలెక్టర్లు!
తెలంగాణలో 22ఏ అంశం ఇంకా కొలిక్కి రాలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి 22ఏ అంశాన్ని ప్రస్తావించారు. నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యను పరిష్కరించే అధికారులను ఆర్డీవోలకు అప్పగించారు.అయితే, ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎటువంటి మార్గదర్శకాలు రాలేదని తెలుస్తోంది. దీంతో ఆర్డీవోలు, కలెక్టర్లు 22ఏ అంశంలో ఏమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం.మరోవైపు నిషేధిత జాబితాలో ఉన్న తమ భూముల సమస్యను పరిష్కరించాలని నియోజకవర్గ ఎమ్మెల్యేల మీద ఒత్తిడి పెంచుతున్నట్టు తెలిసింది. మరోవైపు రాష్ట్రంలో 22ఏ సమస్య లేదన్నట్టుగా సీఎంవో, సీసీఎల్ఏ అధికారులు వ్యవహరిస్తున్నట్టు సమాచారం. వ్యవసాయ భూముల డేటాలో ఎలాంటి తప్పులు లేవని, పట్టణ ప్రాంతాల్లో యూఎల్సీ సమస్య మాత్రమే ఉందన్నట్టుగా సీఎం రేవంత్,మంత్రి పొంగులేటికి రిపోర్టులు ఇస్తున్నట్టు తెలిసింది. ఖారీజ్ ఖాతా పేరిట ప్రతి ఊరిలో 50 నుంచి 100 ఖాతాలను 22 ఏ లిస్టులో చేర్చినట్టు సమాచారం. లక్షలాది ఎకరాల పట్టా భూమిపై ఇంకా నిషేధం కొనసాగుతోంది. ఈ విషయంలో ఎమ్మెల్యేలు చెప్పినా కలెక్టర్లు, ఆర్డీవోలు పట్టించుకోవడం లేదని తెలిసింది.
