తెలంగాణ

రాష్ట్రంలో దారుణం.. ఇద్దరు రైతుల ఆత్మహత్య

రాష్ట్రంలో మరో విషాదం నెలకొంది. పంటలు పండక, చేసిన అప్పులు తీర్చలేక ఇద్దరు అన్నదాతలు ఆయుష్షు తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ రుణమాఫీ చేస్తుందని, పంట అమ్ముకోగా వచ్చిన డబ్బులతో అప్పులు తీర్చాలని భావించిన అన్నదాతలకు నిరాశే ఎదురైంది. మరో వైపు అన్నదాత మరణిస్తే బాధిత కుటుంబానికి చెల్లించాల్సిన రైతు బీమా కూడా రావడం లేదని తెలియడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మెదక్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. మెదక్‌ జిల్లా శౌకత్‌పల్లిలో రవీందర్‌రెడ్డి (40) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయం, కుటుంబ అవసరాల కోసం రూ.4.50 లక్షల అప్పులు చేయగా.. అవి తీర్చే మార్గం లేక పొలంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలం పిప్పల్‌కోటిలో అశోక్‌ (56) అనే రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు.