తెలంగాణ

ఒకే రోజు ముగ్గురు రైతుల బలవన్మరణం

తెలంగాణలో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. ఎల్ నినో కారణంగా వర్షాలు లేక సాగు దిగుబడి రాక అన్నదాతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వరి వేసిన రైతులు అయితే సాగుకు నీళ్లు అందించేందుకు నానా తిప్పలు పడుతున్నారు. తెలంగాణ సర్కార్ ముందే చేతులు ఎత్తేయడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో రాష్ట్ర రైతాంగం ఉన్నది. కోత దశకు వచ్చిన పంట ఎండిపోయే స్థితిలో దర్శనమిస్తుండటంతో ఎలాగైనా కాపాడుకోవడానికి వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించి పొలాలు తడుపుతున్నట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే పెట్టుబడి భారం కావడం, పాత అప్పులకు వడ్డీలు పెరిగిపోవడం, పంట చేతికి వచ్చినా గిట్టుబాటు ధర రాక, మధ్యలో దళారుల దోపిడీ వంటి అంశాలతో అన్నదాత కుదేలవుతున్నాడు. ఈ క్రమంలోనే అప్పుల భారం భరించలేక, పంట దిగుబడి రాలేదని ఆవేదనతో రాష్ట్రంలో ఒకే రోజు ముగ్గురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ ఘటన తీవ్రవిషాదం నింపింది.