తెలంగాణ

శోభాయాత్రలో విషాదం.. వాహనం కింద పడి యువకుడి దుర్మరణం

హైదరాబాద్ మహానగరంలో తీవ్ర విషాదం నెలకొంది. ఖైరతాబాద్ గణేశుల శోభాయాత్రలో భాగంగా ప్రమాదవశాత్తు ఓ యువకుడు వాహనం కింద పడి మరణించాడు. గంగమ్మ ఒడికి చేరేందుకు వినాయకులు వడివడిగా ట్యాంక్ బండ్ వద్దకు వస్తున్న క్రమంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు సెక్రెటేరియట్ ముందు నుంచి ఖైరతాబాద్ బడా గణేశ్ శోభాయాత్ర సాగుతోంది. అయితే, మహాగణపతి శోభాయాత్రను వీక్షించేందుకు లక్షలాది భక్తులు ట్యాంక్ బండ్ వద్దకు చేరుకుంటున్నారు.ఈ క్రమంలోనే సచివాలయం, నెక్లెస్ రోడ్, ఖైరతాబాద్ పరిసరాల్లో భారీగా రద్దీ నెలకొంది.అయితే, ట్రాఫిక్ రద్దీని క్లియర్ చేసే క్రమంలో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జ్ చేయగా.. ఓ యువకుడు నిమజ్జనకోసం తరలుతున్న వాహనంపైకి ఎక్కే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు జారి కిందపడగా వాహనం మీద నుంచి వెళ్లింది. దీంతో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మెట్రో పిల్లర్‌ నంబర్‌ 1167 వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న సివిల్ పోలీసులు వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.