క్రైమ్

హైదరాబాద్ దాండియా వేడుకల్లో విషాదం.. ఇద్దరు యువతులు మృతి!

హైదరాబాద్ మహానగరంలో దారుణం చోటుచేసుకుంది. దుర్గామాత నవరాత్రుల్లో భాగంగా ఏర్పాటు చేసిన దాండియా వేడుకల్లో తీవ్ర విషాదం నెలకొంది. లైటింగ్ స్టాండ్ మీద పడి ఇద్దరు యువతులు మృతి చెందినట్టు తెలుస్తుండగా..మరో 14 మందికిపైగా విద్యార్థులు గాయపడినట్టు సమాచారం. నగర శివార్లలోని నాదర్‌గుల్‌లో ఉన్న ఎంవీఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం రాత్రి ఘనంగా దాండియా వేడుకలు నిర్వహించారు. కళాశాల వార్షికోత్సవ సెలబ్రేషన్స్ ‘సంగమం’ ముగింపు వేడుకల్లో నిర్వహించిన దాండియా నైట్‌లో ప్రమాదవశాత్తు లైటింగ్ స్టాండ్ కూలిపోయింది. బలమైన ఈదురుగాలులు వీచడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.విద్యార్థినీ విద్యార్థులు అందరూ సంతోషంగా దాండియా డ్యాన్సులు చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు లైటింగ్ పోల్ వారిపై కుప్పకూలింది. ఈ ఘటనలో వనపర్తికి చెందిన బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని సోనా (సోని) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాద తీవ్రత కారణంగా మరో విద్యార్థిని కూడా మరణించినట్లు తెలుస్తోంది.