ఆర్టీసీ ఎన్నికల వేళ టీపీసీసీ చీఫ్ సంచలన ప్రకటన..
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.త్వరలోనే ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 9న జరగనున్న ఆర్టీసీ యూనియన్ ఎన్నికల్లో 'తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్' (TWU - రిజిస్ట్రేషన్ నంబర్ : 4-4522)కు అధికార కాంగ్రెస్ తరపున పూర్తి మద్దతు ఇస్తున్నట్టు టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులకు సమాచారం అందించారు. టీడబ్ల్యూయూ యూనియన్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా పనిచేస్తోందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల (DCC), సిటీ (CCC) కాంగ్రెస్ అధ్యక్షులకు, ఎమ్మెల్యేలకు ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు.నేతలు తమ నియోజకవర్గాల పరిధిలోని ఆర్టీసీ డిపోలలో కాంగ్రెస్ అనుబంధ టీడబ్ల్యూయూ యూనియన్‌కు సంపూర్ణ సహకారాన్ని, సమన్వయాన్ని అందించాలని ఆదేశాలు జారీ చేశారు.ఇతర ఏ యూనియన్లను ప్రోత్సహించవద్దని స్పష్టంచేశారు.
