National
తమిళనాడులో కుండపోత.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
తమిళనాడులో ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో గతవారం రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ (IMD) హెచ్చరికల ప్రకారం.. రాష్ట్రంలోని 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరో 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్, మరికొన్నింటికి రెడ్ అలర్ట్ ప్రకటించారు.పుదుక్కోట్టై, శివగంగై, రామనాథపురం, నాగపట్నం జిల్లాలో కుండపోత వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నాగపట్నం తీర ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. తమిళనాడులోని పశ్చిమ,దక్షిణ జిల్లాల్లో వర్షం తీవ్రత అధికంగా ఉండటంతో ముందస్తు భద్రత కోసం కోయంబత్తూరు, దిండుక్కల్, రామనాథపురం జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు జిల్లా కలెక్టర్లు సెలవులు ప్రకటించారు. మరోవైపు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి పరిధిలోని కారైకల్ ప్రాంతంలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.
