Tollywood: టాలీవుడ్‌ను వణికిస్తున్న కత్తెరల రాజ్!
Tollywood: కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి, వందలాది మంది శ్రమతో ఒక కథను తెరకెక్కించిన నిర్మాతలకు షూటింగ్ పూర్తి కావడం ఒక ఎత్తయితే.. సెన్సార్ గది దాటడం మరో ఎత్తుగా మారింది. థియేటర్లలో ప్రేక్షకుల తీర్పు రాకముందే, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) వద్ద పడే కత్తెర దెబ్బలకు సినిమా రూపురేఖలే మారిపోతున్నాయి. ఒకప్పుడు కేవలం సినిమాను చూసి ఏ వయసు వారు చూడాలో ధ్రువీకరించే సర్టిఫికేషన్ బోర్డు, నేడు దర్శకుల సృజనాత్మకతను కట్టడి చేస్తూ చిత్రాల మనుగడనే శాసించే స్థాయికి చేరిందన్న ఆగ్రహం చిత్ర పరిశ్రమలో వ్యక్తమవుతోంది.ముఖ్యంగా పాన్-ఇండియా రేంజ్లో రూపొందే భారీ బడ్జెట్ సినిమాలకు సెన్సార్ ఆంక్షలు తీవ్ర ఆర్థిక నష్టాన్ని మిగులుస్తున్నాయి. గతంలో ప్రభాస్ నటించిన ‘సలార్’ విషయంలో ఫైట్ సీన్ల నిడివిని తగ్గించేందుకు మేకర్స్ అంగీకరించకపోవడంతో బోర్డు ఏకంగా ‘ఏ’ (A) సర్టిఫికేట్ ఇచ్చేసింది.
