తెలంగాణ
నిమ్స్ పేషెంట్లకు టిమ్స్‌లో సర్జరీలు- మంత్రి కీలక ఆదేశాలు
TIMS: హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో పలు రకాల సర్జరీల కోసం రోగులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తోంది. ఈ అంశంపై ప్రభుత్వం స్పందించింది. సర్జరీల వెయిటింగ్ తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నిమ్స్ ఆసుపత్రిలో ఆపరేషన్ల కోసం ఎదురుచూస్తున్న పేషెంట్లకు సనత్‌నగర్‌లోని డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్‌లో సర్జరీలు నిర్వహించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. నిమ్స్‌లో పెరుగుతున్న పేషెంట్ల సంఖ్యకు అనుగుణంగా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అందుబాటులో ఉన్న అన్ని వసతులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. బంజారాహిల్స్‌లోని తన అధికారిక నివాసంలో నిమ్స్‌లోని వివిధ విభాగాల హెచ్‌వోడీలతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
