2 గంటల్లో సమస్యలు తీర్చడానికి ఇది సినిమా కాదు : పవన్ కళ్యాణ్
ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఎదురైన సమస్యలు, వాటి పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నదో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా వివరించారు. సమస్యల పరిష్కారానికి కొంత సమయం పడుతుందని, సినిమాల్లో వలే రెండు గంటల్లో పూర్తి చేయడం సాధ్యం కాదని సంచలన కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ మాత్రం తెలియకుండానే రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారని, సినిమాల్లో లాగా డైలాగ్స్ కొడితే పని జరగదని ఇంతకాలానికి తెలుసుకున్నారా? అని పలువురు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఆదివారం పోలవరం జిల్లాలో పర్యటించిన ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. రంపచోడవరంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. సినిమాల్లో బ్యా గ్రౌండ్ పాట పెట్టి కేవలం రెండున్నర గంటల్లోనే చాలా చేసేయవచ్చని అన్నారు. కానీ, నిజ జీవితంలో మాత్రం అలా కుదరదన్నారు. పన్నెండు, పదిహేను సంవత్సరాలు కింద మీద పడుతూ కష్టపడాల్సి ఉంటుందన్నారు.
