TG : ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామన్నారు.. చివరకు!
ఓ నిరుపేద మహిళకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యింది. ఆమె స్థలం కాస్త రోడ్డుకు ఆనుకుని ఉన్నట్టు సమాచారం. అయితే,ఇందిరమ్మ ఇల్లు మంజూరైందన్న ఆశతో అప్పులు చేసి మరి సదరు మహిళ ఇల్లు నిర్మించుకుంది. ఇల్లు నిర్మాణం పూర్తయ్యాక రోడ్డుపైకి మెట్లు వచ్చాయంటూ అధికారులు వాటిని కూల్చివేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మేళసంఘం గ్రామంలో వెలుగుచూసింది.వివరాల్లోకివెళితే.. గ్రామానికి చెందిన క్యాతం శోభారాణికి ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. నిధులు విడుదల కావాలంటే ముందుగా ఇల్లు కట్టుకోమని అధికారులు చెప్పారు. దీంతో పాత ఇంటిని కూల్చివేసి మరీ కొత్త ఇంటి నిర్మాణం చేపట్టింది. అయితే, రోడ్డుపై మెట్లు ఉన్నాయంటూ పంచాయతీ కార్యదర్శికి సర్పంచ్ భర్త ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దీంతో అధికారులు ఇంటి మెట్లను కూల్చివేయించారు. ముందు అనుమతులు ఇచ్చి ఇప్పుడు కూల్చడం ఏంటని బాధిత మహిళా ఆవేదన వ్యక్తం చేశారు.
