బీజేపీతో పొత్తు ఉండదు.. రెండేండ్లలో కేసీఆరే సీఎం : కేటీఆర్
వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉండబోదని, మళ్లీ కేసీఆరే సీఎం అవుతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. భావజాలం, సైద్ధాంతికంగా తాము బీజేపీకి వ్యతిరేకమని.. అలాంటప్పుడు ఎలా పొత్తు పెట్టుకుంటామని అన్నారు. నిన్న సాయంత్రం కేరళంలో నిర్వహించిన ‘ఇండియా టుడే’ సదస్సులో కేటీఆర్ మాట్లాడుతూ..26ఏళ్లలో ఒక్కసారి కూడా బీజేపీతో తాము పొత్తు పెట్టుకోలేదన్నారు. గత మూడు జనరల్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీచేసిందని పేర్కొన్నారు. కేంద్రం ప్రతిపాదిస్తున్న డీలిమిటేషన్ విధానంతో దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. దేశ జనాభాలో దక్షిణాది రాష్ట్రాల వాటా గతంలో సుమారు 24 శాతం నుంచి 19 శాతానికి తగ్గిందని, ఇప్పుడు జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే అనేక రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు. చట్టసభల్లో సీట్లు పెంచాలనుకుంటే అసెంబ్లీ సీట్లను ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. కేవలం పార్లమెంట్ సీట్లను పెంచడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.
