అండాల దందా.. నగరంలో మరో 18 మంది యువతులు అరెస్టు
యువతులకు డబ్బులు ఎరగా వేసి అక్రమంగా అండాలు సేకరించి డబ్బులు సంపాదిస్తున్న మరో ముఠాగుట్టు రట్టయ్యింది. నిన్న బేగంపేట ఘటన మరువకముందే తాజాగా సరూర్ నగర్ ఎమ్మార్వో ఆఫీస్ సమీపంలోని ఓ ఇంట్లో యువతుల నుంచి అండాలు సేకరిస్తున్న అక్రమార్కులను పోలీసులు గుర్తించారు. విశ్వసనీయ సమాచారం మేరకు కాలేజీ స్టూడెంట్స్ను లక్ష్యంగా చేసుకుని నిర్వహిస్తున్న అండాల విక్రయ ముఠాలను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు సమాచారంతో సరూర్ నగర్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఓ ఇంట్లో ఉన్న 18 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కాలేజీ విద్యార్థినులు, నిరుపేద యువతులను లక్ష్యంగా చేసుకుని ఈ దందా నడుపుతున్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. వారికి పెద్ద మొత్తంలో డబ్బుల ఆశ చూపి, ఇంజెక్షన్లు ఇచ్చి అండాలను సేకరిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
