తెలంగాణ

కుంభకర్ణ ప్రభుత్వాన్ని ముల్లుగర్రతో తట్టిలేపిన రైతులకు ధన్యవాదాలు : కేటీఆర్

జూరాల నుంచి ఆయకట్టుకు నీళ్లు ఇవ్వకపోవడంతో కొన్నిరోజులుగా అన్నదాతలు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఏకంగా జూరాల ప్రాజెక్టు ఎంట్రీ గేటు బద్దలు గొట్టి మరీ రైతులే నీటిని విడుదల చేసుకున్నారు. అనంతరం ప్రభుత్వం పోలీసు పహారాతో రైతులను మరోసారి ప్రాజెక్టు వద్దకు రాకుండా అడ్డుకున్నది. అయితే, గత రెండ్రోజులుగా అన్నదాతల కోసం అటు బీఆర్ఎస్,ఇటు బీజేపీ పార్టీల నేతలు ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలని ఆందోళనలు నిర్వహించారు. తాజాగా సర్కార్ ఆయకట్టుకోసం జూరాల కుడి, ఎడమ కాలువ నుంచి నీటిని విడుదల చేసింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఆసక్తికరపోస్టు పెట్టారు. ‘పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప!’ అంటూ రాసుకొచ్చారు. హక్కుల సాధన కోసం రోడ్డెక్కిన అన్నదాతల పోరాట పటిమను మాజీమంత్రి కొనియాడారు.ప్రాజెక్టు నుంచి నీరు అందక పొలాలు పూర్తిగా ఎండిపోతున్న విపత్కర పరిస్థితుల్లో రైతులు చేసిన సాహసోపేతమైన పోరాటం అత్యంత స్ఫూర్తిదాయకమన్నారు.