బీజేపీ, కాంగ్రెస్ లో మహిళలకు రక్షణ లేదు : ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్
TG: రాష్ట్రంలో మహిళల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వేధింపుల సంస్కృతిని ప్రోత్సహిస్తున్నాయని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. బీజేపీ యువమోర్చా జాతీయ కోశాధికారి టి.ఎం.సాయిప్రసాద్‌పై బీజేపీ ఎస్సీ మోర్చా నాయకురాలు డి.పద్మిని చేసిన లైంగిక, కుల వివక్ష వేధింపుల ఉదంతం రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది. కేంద్ర, రాష్ట్ర పాలకుల అండదండలతోనే ఈ దారుణాలు సాగుతున్నాయని ఆధారాలతో సహా ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు.మల్కాజిగిరి పరిధిలోని అల్వాల్ పోలీస్ స్టేషన్లో అక్టోబర్ 5న బాధితురాలు ఇచ్చిన కంప్లైంట్‌పై సాధారణ సెక్షన్లతో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం వెనుక కుట్ర దాగి ఉందని ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. తెలంగాణలో పోలీస్ మాన్యువల్ కాకుండా ‘రేవంత్ మాన్యువల్’ నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలు 30 పేజీల సమగ్ర ఆధారాలతో ఫిర్యాదు సమర్పిస్తే, నిందితుడిని రక్షించేలా కేసును పలుచన చేశారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే రాష్ట్రంలో చార్జ్షీట్లు పడవు, నిందితులను అరెస్ట్ చేయరని మండిపడ్డారు.
