TGSAFE: లైసెన్సులు రద్దయినా డోంట్ కేర్.. దర్జాగా తెరిచి మరీ కల్తీ దందా!
TGSAFE: హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లోని కార్పొరేట్ అద్దాల మేడలు, జిగేల్మనే ఏసీ రెస్టారెంట్ల అసలు రంగు బయటపడినా నిర్వాహకుల్లో ఏమాత్రం చలనం కనిపించడం లేదు. తెలంగాణ ఫుడ్ సేఫ్టీ విభాగం మెరుపు దాడులు చేసి, లైసెన్సులు క్యాన్సల్ చేసినా.. "మాకేం కాదు.. మా బిజినెస్ ఆగదు" అన్నట్లుగా నిర్వాహకులు దర్జాగా బోర్డులు తెరిచి కల్తీ దందాను కొనసాగిస్తున్నారు. లక్షల్లో లాభాలు గడించే హోటళ్ల ఓనర్స్‌కి అధికారుల తనిఖీలు, నామమాత్రపు జరిమానాలు లెక్కే కాకుండా పోయాయి.గచ్చిబౌలిలోని ప్రముఖ రెస్టారెంట్ ‘అంతేరా కిచెన్ అండ్ బార్’ లైసెన్స్‌ను ఫుడ్ సేఫ్టీ అధికారులు రూల్స్ బ్రేక్ చేసిన కారణంగా క్యాన్సల్ చేశారు. అయితే అధికారులు వెళ్లిన మరుసటి రోజే ఎటువంటి బెరుకు లేకుండా ఆ రెస్టారెంట్ మళ్లీ తెరుచుకుని వ్యాపారం సాగించడమే ఓనర్ల బరితెగింపునకు నిదర్శనంగా నిలుస్తుంది. నిబంధనలను కాలరాసినందుకు 11 ప్రముఖ రెస్టారెంట్ల లైసెన్సులు రద్దవగా, మరికొన్నింటికి నోటీసులు అందాయి. కానీ చట్టాల్లోని లొసుగులు, నామమాత్రపు పెనాల్టీలను అడ్డుపెట్టుకుని అదే అపరిశుభ్ర కిచెన్లలో మళ్లీ వంటలు మొదలుపెట్టేస్తున్నారు. రోజుకు వేలల్లో పడే జరిమానాలు.. వాళ్లు గడించే లక్షల లాభాల ముందు కంటితుడుపుగానే మిగులుతున్నాయి.
