తెలంగాణ

అరెస్టులతో ప్రశ్నించే గొంతులను అణచలేరు : రాంచందర్‌ రావు

TG: "అరెస్టులు, పోలీసు నిర్బంధాలతో ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతులను రేవంత్ సర్కార్ ఎంతమాత్రం అణచివేయలేదు" అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు అన్నారు. జూరాల ప్రాజెక్టు కింద పంటలు ఎండిపోతున్నాయంటూ రోడ్డెక్కిన ఆయకట్టు రైతులకు సంఘీభావం తెలిపేందుకు మంగళవారం ఆయన బయలుదేరగా.. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలో పోలీసులు కాన్వాయ్‌ను అడ్డగించి ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామంతో జడ్చర్ల జాతీయ రహదారిపై ఒక్కసారిగా యుద్ధ వాతావరణం నెలకొంది.రాంచందర్‌రావును అదుపులోకి తీసుకుని పోలీస్ వాహనంలోకి ఎక్కిస్తుండగా పెద్ద సంఖ్యలో వచ్చిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. వాహనాలకు అడ్డంగా పడుకుని, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా పోలీసులకు, కాషాయ పార్టీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. నాయకులను వాహనాల్లో తరలించడంతో ఆగ్రహించిన కార్యకర్తలు హైదరాబాద్-బెంగళూరు 44వ నంబర్ జాతీయ రహదారిపై బైఠాయించి భారీ రాస్తారోకోకు దిగారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది.