దానంపై అనర్హత.. జంపింగ్ జిలానీలకు ఇదొక గుణపాఠమా..?
TG Politics: ఎన్నికల్లో ఒక పార్టీ గుర్తుపై పోటీ చేయడం.. గెలిచాక అధికార పార్టీ పంచన చేరడం.. తెలంగాణ రాజకీయాల్లో కొన్నేళ్లుగా సాధారణ అలవాటుగా మారిపోయింది. ఓటర్ల తీర్పును అపహాస్యం చేస్తూ పార్టీలు మారినా తమకేమీ కాదనే ధీమాతో ఉండే నాయకులకు తాజాగా ఉన్నత న్యాయస్థానం ఊహించని షాక్ ఇచ్చింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై హైకోర్టు అనర్హత వేటు వేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడే నేతలకు చట్టం గుణపాఠం నేర్పగలదన్న బలమైన సంకేతాన్ని ఈ తీర్పు ఇచ్చినట్లు అయ్యింది.తాజాగా ఘటనలో దానం నాగేందర్ చేసిన అతిపెద్ద తప్పిదం ఆయన రాజకీయ భవిష్యత్తుకే గొడ్డలిపెట్టుగా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లడమే కాకుండా, సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి హస్తం పార్టీ ‘బి-ఫామ్’పై ఆయన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. వేరే పార్టీ టికెట్‌పై అధికారికంగా ఎన్నికల బరిలోకి దిగడమే ఆయన పార్టీ మారారనడానికి తిరుగులేని న్యాయపరమైన సాక్ష్యంగా మారింది. కోర్టు ముందు ఎలాంటి సాకులూ నిలబడకుండా నేరుగా ఆయనపై అనర్హత వేటు పడటానికి ఇదే ప్రధాన కారణమైందని చెబుతున్నారు.
