తెలంగాణ

బీఆర్ఎస్ వరుస నిరసనలు.. బీజేపీకి ఆ ఛాన్స్ ఇవ్వొద్దనేనా?

కాంగ్రెస్‌పై వ్యతిరేకత పెరిగినప్పుడు ఆ రాజకీయ ప్రయోజనం బీఆర్‌ఎస్‌కు దక్కాలా? లేక బీజేపీకి వెళ్లాలా? బీఆర్‌ఎస్‌ వరుస ఆందోళనలకు దిగుతున్న తీరు చూస్తే.. రెండో అవకాశానికి ఛాన్స్ ఇవ్వకూడదనే వ్యూహంతోనే గులాబీ పార్టీ ముందుకు వెళ్తోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.బీజేపీకి ప్రతిపక్ష స్పేస్ దక్కకుండా చేయడమే బీఆర్‌ఎస్‌ అసలు టార్గెటా? అనే చర్చ ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.తెలంగాణలో బీజేపీ కూడా వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తన బేస్‌ను మరింత బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఏర్పడే అసంతృప్తిని తమకు అనుకూలంగా మలుచుకోవాలని కమల దళం భావిస్తోంది. ఇదే బీఆర్‌ఎస్‌కు అసలు సవాల్‌గా మారుతోందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్‌ఎస్‌ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ వ్యతిరేక ఓటు బీజేపీ వైపు మళ్లితే గులాబీ పార్టీ రాజకీయంగా మరింత ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది. అందుకే ‘కాంగ్రెస్‌పై పోరాడేది మేమే.. ప్రజల సమస్యలపై రోడ్డెక్కేది మేమే’ అనే ఇమేజ్‌ను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్‌ఎస్‌ గట్టిగా ప్రయత్నిస్తోందనే టాక్ వినిపిస్తోంది.