లీడర్ల భూముల గొడవ.. పాలిటెక్నిక్ విద్యార్థులను పట్టించుకోరా?
TG: రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ నాయకుల ఫాంహౌస్లు, భూ సరిహద్దుల వివాదాలే నిత్యం పతాక శీర్షికల్లో నిలుస్తున్న వేళ.. వేలాది మంది సామాన్య విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదపుటంచున పడిన సంగతి పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. సాంకేతిక విద్యా రంగాన్ని సమూలంగా మార్చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం తెరపైకి తెచ్చిన వివాదాస్పద ‘జీవో ఎంఎస్ నంబర్ 97’ ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర నిరసన జ్వాలలను రగిలిస్తోన్న సంగతి తెలిసిందే.
దశాబ్దాలుగా పేద, మధ్యతరగతి బిడ్డలకు ఇంజినీరింగ్ భరోసాగా నిలిచిన పాలిటెక్నిక్ వ్యవస్థను ప్రభుత్వం నామరూపాల్లేకుండా చేస్తోందన్న ఆందోళనతో విద్యార్థులు తరగతులు బహిష్కరించి రహదారులపై బైఠాయిస్తున్నారు.
జూలై 3న ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా జారీ చేసిన జీవో 97 ప్రకారం.. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలు, డిప్లొమా కోర్సులను నూతనంగా ఏర్పాటైన 'శక్తి' (SHAKTI - స్కిల్, హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్స్) శాఖతో పాటు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి మారుస్తున్నారు. నైపుణ్యాభివృద్ధి ముసుగులో తీసుకువచ్చిన ఈ మార్పు.. సాంకేతిక విద్యా ప్రమాణాలకే గొడ్డలిపెట్టుగా మారిందని విద్యార్థి సంఘాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి.
