తెలంగాణ

పోలీసు దిగ్భంధంలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఫాంహౌస్!

తెలంగాణ రాజకీయాలు ఊహించని మలుపు తీసుకున్నాయి. ధరణి మాటున గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ నేతలు అడ్డగోలుగా భూములు దోచుకున్నారని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే.దీనికి తోడు మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్ భూములపై సర్వే చేసి ప్రభుత్వ భూముల లెక్క తేల్చాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఎర్రవల్లిలో కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం పరిసరాల్లో భూముల సర్వే కొనసాగుతోంది. అయితే, మరో బీఆర్ఎస్ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఫాంహౌస్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. గత రెండు రోజులుగా వందలాది మంది పోలీసులు జగదీష్ రెడ్డి వ్యవసాయ క్షేత్రం బయట మోహరించి దిగ్బంధనం చేసినట్టు సమాచారం.ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పోలీసులను పంపి ప్రభుత్వ యంత్రాంగాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నదని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మాజీ మంత్రి ఫాంహౌస్ వద్ద పోలీసులు భారీగా ఎందుకు మోహరించారని ప్రశ్నిస్తే సరైన సమాధానం కూడా లేదని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.