తెలంగాణ
TG : రూ.90 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సబ్ రిజిస్ట్రార్
నారాయణపేట జిల్లా సబ్ రిజిస్ట్రార్, వివాహాల కార్యాలయంలో ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ రైడ్లో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. ఓ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో లంచం డిమాండ్ చేసినట్లు అందిన కంప్లైంట్తో ఈ తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. అధికారుల వివరాల ప్రకారం.. జూలైలో జరిగిన ఓ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించి సబ్ రిజిస్ట్రార్ లగిశెట్టి వెంకటస్వామి రూ.90 వేల లంచం అడిగినట్లు బాధితులు తమని ఆశ్రయించినట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే రూ.50 వేలు చెల్లించిన ఆయన.. మిగిలిన మొత్తాన్ని ఈ రోజు ఇవ్వాల్సి ఉంది. ఆయన ఫిర్యాదుతో రంగంలోకి దిగి నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
