క్రైమ్

చైన్ స్నాచర్ల బీభత్సం..మహిళలను బైక్‌తో ఢీకొట్టి, కట్టర్‌తో కట్ చేసి!

హైదరాబాద్ మహానగరంలో చైన్ స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు. రోడ్డు మీద ఒంటరిగా వెళ్లే మహిళలను టార్గెట్ చేస్తున్న ఈ దుండగులు.. ఈసారి మరింత బరితెగించారు. పట్టపగలే ఓ మహిళను వెంబడించి మరీ యాక్సిడెంట్ చేసి ఆమె మెడలోని చైన్‌ను కట్టర్ సాయంతో కట్ చేసి దొంగిలించుకుని వెళ్లిపోయారు. ఈ ఘటన నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం చెరువు అన్నారం స్టేజి వద్ద చోటుచేసుకోగా మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. నల్గొండ జాతీయ రహదారిపై హిమబిందు అనే మహిళ ద్విచక్ర వాహనంపై తన కొడుకుతో కలిసి వెళ్తోంది. నకిరేకల్‌ నుంచి ఆటిపాముల వైపు వెళ్తుండగా ఎదురుగా బైక్ మీద హెల్మెట్లు ధరించి వచ్చిన ముగ్గురు దుండగులు.. బాధితురాలి బైక్‌ను ఢీకొట్టారు. దీంతో తల్లీకొడుకులను రోడ్డుపై కిందపడిపోగా ఆమెను బెదిరించారు. చంపేస్తామని బెదిరింపులకు గురిచేసి కట్టర్‌తో దాడి చేసి ఆమె 3 తులాల పుస్తెలతాడును దుండగులు ఎత్తుకెళ్లారు.