తెలంగాణ

Yasangi crops : యాసంగి పంట వద్దంటున్న రేవంత్.. రైతుల పరిస్థితి ఏంటి?

తెలంగాణ పల్లెల్లో ఇప్పుడు ఎవరి నోట విన్నా ఒకటే మాట.. "యాసంగిలో పంటలే వద్దంటే మేమెట్లా బతకాలి?". సాధారణంగా ఈ సమయానికి రైతులు నాగళ్లు భుజాన వేసుకుని, పొలాలను దున్ని విత్తనాలు చల్లడానికి రెడీ అవుతుంటారు. కానీ ఉన్నట్టుండి సర్కారు నుంచి వచ్చిన ఆదేశాలు అన్నదాత కాళ్ల కింద భూమిని కదిలించేశాయి. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాలు పడలేదు, ప్రాజెక్టుల్లో నీళ్లు లేవు, భూగర్భ జలాలు పాతాళానికి పోయాయి కాబట్టి ఈసారి యాసంగి సాగుకు దూరంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రైతులకు పిలుపునిచ్చారు. సాగు చేస్తే తాగునీటికి, కరెంటుకు కూడా తీవ్ర కటకట ఏర్పడుతుందని అధికారులు తేల్చేశారు. పరిస్థితి ఇంతవరకు నిజమే కావొచ్చు.. కానీ పంట వేయకపోతే మా బతుకులు ఏమైపోవాలనేదే ఇప్పుడు క్షేత్రస్థాయిలో రైతులు వేస్తున్న సూటి ప్రశ్న.