తెలంగాణ

TG: అడుగంటుతున్న ప్రాజెక్టులు.. తీవ్ర నీటి కరువు తప్పదా?

TG: రాష్ట్రంలో ఎండలు ముదరకముందే నీటి గండం పొంచి ఉంది. ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు రోజురోజుకూ పడిపోతుండటంతో రానున్న రోజుల్లో గొంతెమ్మ కోర్కెలు కాదు కదా.. కనీసం గొంతు తడుపుకోవడానికే నీళ్లు దొరకడం గగనమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పరిస్థితి తీవ్రతను ముందే పసిగట్టిన ప్రభుత్వ యంత్రాంగం, సాగు కంటే మునుముందు తాగునీటి అవసరాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది.ముఖ్యంగా సింగూరు జలాశయం పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ప్రాజెక్టులో ప్రస్తుతం కేవలం 3.924 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉండగా, ఈ నిల్వలు డిసెంబర్ 10 వరకే సరిపోతాయని అధికారులు తేల్చేశారు. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల పరిధిలోని దాదాపు 2,395 గ్రామాలు, 19 పట్టణాలు ఈ నీటిపైనే బతుకుతున్నాయి. ఈ నాలుగు జిల్లాల తాగునీటి అవసరాల కోసం రూ.84.14 కోట్లు, హైదరాబాద్‌లో నీటి కష్టాలు రాకుండా చూసేందుకు మరో రూ.57.55 కోట్లతో ప్రత్యామ్నాయ పనులు చేపట్టాలని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.