క్రీడలు

స్వర్ణం సాధించిన తెలంగాణ స్టార్ అథ్లెట్..

పారా ఏషియన్ క్రీడల్లో తెలంగాణ క్రీడాకారిణి మరోసారి సత్తా చాటారు. భారత జాతీయ పతాకాన్ని విదేశీ గడ్డపై సగర్వంగా ఎగరేశారు. పారా ఏషియన్ గేమ్స్-2026లో రాష్ట్రానికి చెందిన అథ్లెట్ దీప్తి జివాంజీ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచారు. మహిళల 400 మీటర్ల రన్నింగ్ విభాగం ఫైనల్లో అద్భుతమైన వేగంతో దూసుకెళ్లారు. కేవలం 56.36 సెకన్లలోనే లక్ష్యాన్ని చేరుకుని బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. పరుగు ప్రారంభం నుంచే పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ప్రత్యర్థులను వెనక్కినెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. పారా ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు ఇది 5వ స్వర్ణ పతకం కావడం విశేషం. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి అంతర్జాతీయ ట్రాక్‌లపై నిలకడగా రాణిస్తున్న దీప్తి.. 2024 పారిస్ పారాలింపిక్స్‌లోనూ కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించారు.తాజాగా పసిడి పతకం సాధించడంతో ఆమె విజయాన్ని అందరూ కీర్తిస్తున్నారు.