TG: రూ.400 కోట్లతో రెసిడెన్షియల్ స్కూళ్లు.. ప్రపంచంతో పోటీ పడేలా క్లాసులు : భట్టి విక్రమార్క
G: తెలంగాణలోని ప్రతి పేద విద్యార్థి ప్రపంచంలోని అగ్రదేశాల పిల్లలతో సమానంగా పోటీపడేలా విద్యావ్యవస్థను సమూలంగా మారుస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా రూ.400 కోట్ల భారీ వ్యయంతో సకల సౌకర్యాలతో కూడిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తున్నామని వెల్లడించారు.హనుమకొండ జిల్లా పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని కాజీపేట విద్యానగర్లో రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 'తెలంగాణ పబ్లిక్ స్కూల్' నిర్మాణానికి బుధవారం డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో భట్టి మాట్లాడుతూ.. 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్' ప్రాజెక్టులో భాగంగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున అత్యాధునిక రెసిడెన్షియల్ పాఠశాలలను సర్కారు ఏర్పాటు చేస్తోందన్నారు. ప్రపంచంలోని మొదటి పది అగ్రదేశాలతో ఇక్కడి విద్యా ప్రమాణాలు పోటీపడేలా వీటిని తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు.
