తెలంగాణ

జీవో నెంబర్ 259ను సవరించాలి, బోరుబావుల రంగాన్ని సంక్షోభం నుంచి కాపాడాలి

Telangana: బోరుబావుల తవ్వకాల రంగం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని నివారించి, ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది కార్మికులు, డ్రైవర్లు, వ్యాపారుల ఉపాధిని కాపాడాలని తెలంగాణ రిగ్ ఓనర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 259ను తక్షణమే సవరించి, ఆచరణ సాధ్యమైన నిబంధనలు అమలు చేయాలని అసోసియేషన్ అధ్యక్షుడు ముస్కు అంజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి నర్సిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో అసోసియేషన్ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. బోరుబావుల తవ్వకాలపై విధించిన ఆంక్షల కారణంగా రిగ్ కార్మికులు, ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి పనిచేస్తున్న డ్రైవర్లు, వాల్వ్ కార్మికులు, నిర్మాణ రంగంపై ఆధారపడిన మేసన్లు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రంగం స్తంభిస్తే నిర్మాణ రంగంపైనా తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు.