తెలంగాణ

TG: MRP స్టిక్కర్లు మార్చి బియ్యం దోపిడీ.. 11 మందిపై కేసులు!

TG: నిత్యావసర సరుకైన బియ్యం అమ్మకాల్లో అక్రమాలకు తెరలేపి, సామాన్యుల జేబులకు చిల్లు పెడుతున్న కేటుగాళ్ల గుట్టు రట్టయింది. కంపెనీలు ముద్రించిన అసలు ఎంఆర్‌పీ ధరలను గోల్‌మాల్ చేసి, అధిక రేట్లతో కూడిన నకిలీ స్టిక్కర్లు అతికిస్తూ వినియోగదారులను మోసం చేస్తున్న వ్యాపారులపై తెలంగాణ పౌరసరఫరాల శాఖ కొరడా ఝళిపించింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ టాస్క్‌ఫోర్స్, లీగల్ మెట్రాలజీ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన మెరుపు తనిఖీల్లో ఈ దారుణ మోసం వెలుగుచూసింది. నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన 11 మంది వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర ఆదేశాలతో అధికారులు హోల్‌సేల్, రిటైల్ మార్కెట్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వ్యాపారులు వినియోగదారులను దోచుకుంటున్న తీరు చూసి అధికారులు విస్మయానికి గురయ్యారు. బియ్యం మిల్లులు, బ్రాండెడ్ కంపెనీలు బస్తాలపై ముద్రించిన అసలు ధరను చెరిపేయడం లేదా తొలగించడం చేస్తున్నారు.