TG: సర్కారు బడులకు ఎసరు.. టీపీఎస్ పేరుతో వేలాది పాఠశాలల విలీనం!
TG: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల ఉనికిని ప్రశ్నార్థకం చేసేలా విద్యాశాఖ తీసుకున్న తాజా నిర్ణయం తీవ్ర దుమారం రేపుతోంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 26 వేల బడులను 4 వేలకు కుదిస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి గతంలో చెప్పిన మాటల దిశగానే ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ (టీపీఎస్) పేరుతో సర్కారు బడులను విలీనం చేసి, పరోక్షంగా వేలాది పాఠశాలలకు తాళాలు వేసే కుట్ర జరుగుతోందన్న ఆందోళన ఉపాధ్యాయ, ప్రజా సంఘాల్లో వ్యక్తమవుతోంది.ప్రభుత్వం కొత్తగా 134 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను మంజూరు చేస్తూ, 2027-28 నాటికి వాటిని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. అయితే కేవలం కొత్త భవనాలు నిర్మించడంతో ఆగకుండా.. ఈ టీపీఎస్లకు సమీపంలో ఉన్న మండల పరిషత్, జిల్లా పరిషత్ స్కూళ్లు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకులాలు, జూనియర్ కాలేజీలను సైతం అందులో విలీనం చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
