TG: విద్యాశాఖలోనే పాలిటెక్నిక్ కాలేజీలు.. ప్రభుత్వం జీవో
TG: రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాలిటెక్నిక్ కాలేజీలను కార్మిక శాఖ (శక్తి విభాగం) పరిధిలోకి తీసుకొచ్చే ప్రతిపాదనను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఇకపై పాలిటెక్నిక్ కళాశాలలన్నీ యథావిధిగా విద్యాశాఖ పరిధిలోనే కొనసాగుతాయని స్పష్టం చేస్తూ తాజాగా జీవో నంబర్ 157 ను జారీ చేసింది. గతంలో జులై 3న విడుదల చేసిన జీవో 97ను సవరిస్తూ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు ఇచ్చింది.కొత్తగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. పాలిటెక్నిక్ విద్యను 'యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ'లో విలీనం చేయడం గానీ, కార్మిక శాఖకు బదిలీ చేయడం గానీ జరగదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. అంతేకాకుండా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కూడా విద్యాశాఖ కిందే ఉంటుందని జీవోలో స్పష్టతనిచ్చింది. అయితే, రాష్ట్రంలోని ఐటీఐలు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు మాత్రం కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ (శక్తి విభాగం) పరిధిలోకి వెళ్లాయి.
