Telangana Politics : తెలంగాణలో కేసులు, ఫిర్యాదుల పర్వం.. ఇక రణరంగమేనా?
Telangana Politics : తెలంగాణ రాజకీయం అసెంబ్లీ గేట్లు దాటి కౌంటర్ కేసులు, పోలీస్ స్టేషన్ల పంచాయితీల వైపు మళ్లాయి. నిన్నటిదాకా మైకుల ముందు మాటల యుద్ధానికే పరిమితమైన నేతలు.. ఇప్పుడు ప్రత్యర్థులపై న్యాయపరంగా ప్రతీకారం తీర్చుకునేందుకు పోలీసుల దగ్గరికి వెళ్తున్నారు. "నువ్వు నాపై కంప్లైంట్ ఇస్తే.. నీపై అంతకంటే పెద్ద సెక్షన్లతో కేసు పెట్టిస్తా" అన్నట్లుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పోటాపోటీ ఎఫ్ఐఆర్లతో రణరంగాన్ని తలపిస్తున్నారు.శాసనసభ వేదికగా మొదలైన రాజకీయ సెగలు ఇప్పుడు పోలీస్ స్టేషన్లను చుట్టుముట్టాయి. నల్ల చొక్కాలతో నిరసన తెలిపేందుకు సిద్ధమైన గులాబీ దళానికి, అసెంబ్లీ వద్ద మోహరించిన భద్రతా బలగాలకు మధ్య జరిగిన తోపులాటే ఈ కేసుల పర్వానికి తెరలేపింది. విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్‌పై అనుచితంగా ప్రవర్తించారంటూ కేటీఆర్, హరీష్ రావు సహా కీలక బీఆర్ఎస్ నేతలపై సైఫాబాద్ పోలీసులు నాన్ బెయిలబుల్ స్థాయి ఆరోపణలతో కేసులు నమోదు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.
