రేవంత్ ఆరోపణలు.. వాళ్ల నుంచి మద్దతు కరువు
Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డిది దూకుడు రాజకీయం అని చాలా మంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పార్టీపై, పాలనపై విమర్శలు చేసే ప్రత్యర్థులపై విరుచుకుపడటంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. అయితే ఇటీవల అసెంబ్లీలో గులాబీ పార్టీ పెద్దల భూముల వ్యవహారంపై సీఎం విసిరిన బాంబు ప్రకంపనలు సృష్టించింది. కానీ, ఈ యుద్ధంలో సీఎంకు సొంత కేబినెట్, ఎమ్మెల్యేల నుంచి దక్కిన మద్దతు చూస్తే.. "హస్తం గూట్లో రేవంత్ ఏకాకిగా మారుతున్నారా?" అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.ఎర్రవల్లి ఫాంహౌస్ పరిసరాల్లోని వందలాది ఎకరాల అసైన్డ్ భూముల అంశాన్ని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా బట్టబయలు చేశారు. ప్రత్యర్థి పార్టీ మూలాలను కదిలించేలా ఇంతటి భారీ అస్త్రాన్ని ప్రయోగించినప్పుడు సాధారణంగా అధికార పక్ష మంత్రులు, ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా విరుచుకుపడాలి. ప్రభుత్వ వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.
