తెలంగాణ

Telangana Politics: కామ్రేడ్స్ చెరోదారి.. గ్రాడ్యుయేట్ పోరులో కాంగ్రెస్‌కు ఊహించని షాక్ తప్పదా!

Telangana Politics: తెలంగాణలో జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సమరంలో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రెండు స్థానాలనూ క్లీన్‌స్వీప్ చేసి తమ సత్తా చాటాలని అధికార కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తుంటే.. మిత్రపక్షాలైన కమ్యూనిస్టుల వైఖరి ఇప్పుడు హస్తం పార్టీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్నప్పటికీ, రాష్ట్ర స్థాయికి వచ్చేసరికి కామ్రేడ్స్ చెరో దారి చూసుకుంటున్నారు. మొన్నటిదాకా కలిసి నడిచిన సీపీఎం హ్యాండ్ ఇవ్వడం, మరో మిత్రపక్షమైన సీపీఐ నాన్చుడు ధోరణి అవలంబిస్తుండటం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ఇటీవల జరిగిన ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఎం అనుబంధ సంఘాలు కలిసి పనిచేసి విజయవంతమయ్యాయి. దీంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో కూడా కాంగ్రెస్ అభ్యర్థులకు సీపీఎం అండగా నిలుస్తుందని పార్టీ శ్రేణులు భావించాయి. కానీ సీన్ కట్ చేస్తే.. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే సుత్తి కొడవలి పార్టీ రూట్ మార్చేసింది. కాంగ్రెస్‌తో సంబంధం లేకుండా సొంతంగా ఒక ప్రత్యేక ఫ్రంట్‌ను ఏర్పాటు చేసి, తమ అభ్యర్థిని కూడా అధికారికంగా ప్రకటించేసింది.