తెలంగాణ

Telangana Politics: కాంగ్రెస్ - బీఆర్ఎస్ చేతులు కలపబోతున్నాయా ?

Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో ఊహకందని పరిణామం దిశగా చర్చలు మొదలయ్యాయా? ఉదయం లేస్తే నువ్వా - నేనా అంటూ కత్తులు దూసుకునే కాంగ్రెస్ - బీఆర్ఎస్ పార్టీలు ఉమ్మడి శత్రువుపై పోరాటానికి ఒకే గూటికి చేరబోతున్నాయా? రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే నానుడిని నిజం చేస్తూ ఈ రెండు బద్ధ వ్యతిరేక శక్తులు చేతులు కలపడానికి రంగం సిద్ధమవుతోందా? ప్రస్తుతం గాంధీ భవన్ నుంచి తెలంగాణ భవన్ వరకు.. రాజకీయ విశ్లేషకుల నుంచి సామాన్య ప్రజల వరకు ఇదే అంశం హాట్ టాపిక్‌గా మారింది.ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సవరణ ప్రక్రియ (సర్) చుట్టూ ముసురుకున్న వివాదమే ఈ ఊహాగానాలకు ప్రధాన కారణమైంది. తెలంగాణలో పెద్ద ఎత్తున అర్హులైన ఓట్లను గంపగుత్తగా తొలగిస్తున్నారని, బూత్ లెవల్ ఏజెంట్ల వ్యవహారం నుంచి డ్రాఫ్ట్ లిస్ట్ వరకు ప్రతి దశలోనూ ఎన్నికల సంఘం ఏకపక్షంగా వెళ్తోందని అధికార కాంగ్రెస్ బహిరంగంగానే మండిపడుతోంది.