బీఆర్ఎస్, కాంగ్రెస్ దొందూ దొందే.. ఫామ్‌హౌస్‌ల చుట్టూ భూముల కబ్జాలేనా..?
Telangana Politics: హైదరాబాద్ శివార్లలో ఇప్పుడు ఏ మూల చూసినా కూల్చివేతలు, ఆక్రమణల రచ్చే కనిపిస్తోంది. చెరువులు, బఫర్ జోన్లు, ఎఫ్‌టీఎల్ పరిధులను కాపాడాలంటూ సామాన్యుల నిర్మాణాలపై దూసుకెళ్తున్న అధికారులు.. రాజకీయ పలుకుబడి ఉన్న బడా నేతల విలాస భవంతుల వద్దకు వచ్చేసరికి చేతులెత్తేస్తున్నారనే విమర్శలు తీవ్రస్థాయికి చేరాయి. మొన్నటిదాకా గత పాలకుల ఫామ్‌హౌస్‌లను లక్ష్యంగా చేసుకుని గళమెత్తిన కాంగ్రెస్ శ్రేణులు, ఇప్పుడు తమ పార్టీ నేతలే చెరువులను ఆక్రమించి కట్టిన నిర్మాణాలపై బీఆర్‌ఎస్ బయటపెడుతున్న ఆధారాలతో డిఫెన్స్‌లో పడ్డాయి. నిన్న మీరు.. నేడు మేము అంటూ ఇరు పార్టీలు సాగిస్తున్న ఈ 'ఫాంహౌస్ యుద్ధం' వెనుక పచ్చని ప్రకృతి వనరులు బలైపోతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.గత ప్రభుత్వ హయాంలో జీవో 111ను తుంగలో తొక్కి నిర్మించారంటూ జన్వాడ ఫాంహౌస్ మొదలుకొని పలు గులాబీ నేతల ఎస్టేట్లపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే పాలన మారినా తీరు మారలేదన్న రీతిలో, ప్రస్తుతం అధికార కాంగ్రెస్ కీలక నేతలు, మంత్రుల పరిధిలోని విలాసవంతమైన ఫాంహౌస్‌లు చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లను మింగేసి నిర్మించినవేనంటూ బీఆర్‌ఎస్ శ్రేణులు సరికొత్త డ్రోన్ విజువల్స్, వీడియోలతో విరుచుకుపడుతున్నాయి.
