Telangana Politics: ఓ వైపు లీడర్ల భూముల గొడవలు.. ఇంకోవైపు 22ఏతో సామాన్యుల తిప్పలు
Telangana Politics: శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత కేసీఆర్, ఆయన కుటుంబ భూ చిట్టాలు విప్పారు. అనంతరం మీడియా ముందుకొచ్చిన మాజీ మంత్రి హరీశ్‌రావు సీఎం ఆస్తుల లెక్కలు బయటపెట్టి ఎదురుదాడికి దిగారు. మైకుల ముందు నడిచిన ఈ హైవోల్టేజ్ ఆరోపణల యుద్ధం రాజకీయ వర్గాల్లో కాకరేపింది నిజమే కానీ ఈ పోరులో సామాన్య జనం ఎదుర్కొంటున్న అసలు సిసలు కష్టం మరుగున పడిపోయిందన్నది మాత్రం వాస్తవం. నాయకులు వందల ఎకరాల ఆక్రమణలపై వాదులాడుకుంటుంటే.. తమకున్న రెండెకరాలు, ఓ గుంట జాగ అమ్ముకోలేక, కొనుక్కోలేక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్న సామాన్యుడి గోడును పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.ప్రస్తుతం తెలంగాణలో 22A నిషేధిత భూముల వ్యవహారం ఒక పెను సంక్షోభంగా మారింది. అసలు ఈ సమస్యపై సమగ్ర చర్చ జరిగి బాధితులకు ఊరట దక్కుతుందని ప్రజలు ఆశించారు. కానీ ప్రజా సమస్యలను తీర్చాల్సిన చట్టసభ వేదిక.. ఇరుపార్టీల నేతల భూ బాగోతాలు, సవాళ్లు, ప్రతిసవాళ్లకు వేదికగా మారిపోయింది.ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలు, మీడియా ముందు పెడుతున్న లెక్కలు టీవీల్లో హెడ్లైన్లుగా మారుతున్నాయే తప్ప, క్షేత్రస్థాయిలో సమస్యను పరిష్కరించడం లేదన్నది వాస్తవం. అసెంబ్లీలో నడిచిన ఈ రాజకీయ డ్రామాతో అసలు ఎజెండా ఎప్పుడో పక్కదారి పట్టిందని ప్రజా క్షేత్రంలో వినిపిస్తున్న విమర్శ.
