తెలంగాణ

సీఎం రేవంత్ రెడ్డికి- హరీష్ రావు సవాల్!..

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం.. తెలంగాణలో మరోసారి పొలిటికల్ వార్‌కు వేదికగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్‌పై చేసిన విమర్శలకు.. మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. రేవంత్ వ్యాఖ్యలను టార్గెట్ చేస్తూ.. ఉద్యోగాలు, రేషన్ కార్డులు, ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతుబంధు, రుణమాఫీ వరకు ఒక్కో అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఒకప్పుడు రాష్ట్ర ప్రజలకు 420 హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు సంగారెడ్డి సభలో 420 మాటలు మాట్లాడారని హరీష్ రావు ఎద్దేవా చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఇలాంటి రాజకీయ విమర్శలు చేయడం తనకు ఇబ్బందిగా ఉన్నా.. సీఎం చేసిన వ్యాఖ్యలకు స్పందించక తప్పడం లేదన్నారు. దీంతో రేవంత్ చేసిన విమర్శలకు.. హరీష్ రావు ఇచ్చిన కౌంటర్ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.